Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సిఐ చొక్కా పట్టిన అంబటి రాంబాబు!, హెచ్చరిక, అరెస్టు

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత అంబటి రాంబాబు బుధవారం ఓ సిఐ చొక్కా పట్టుకున్నారట. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ పార్టీ బుధవారం, గురువారం రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వగా, అంబటి రాంబాబు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో రోడ్డు పైన రాస్తా రోకో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అంబటి రెచ్చిపోయారు. సీఐ చొక్కా పట్టుకుని, వేలెత్తి చూపుతూ హెచ్చరికలు చేశారని వార్తలు వచ్చాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి సహా 50 మంది కార్యకర్తలు కొండమోడు సెంటర్లో రాస్తా రోకోకు దిగారు. దీంతో మూడు కిలో మీటర్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా రాస్తారోకోను విరమించాలని సీఐలు బిలాలుద్దీన్, వై. శ్రీధర్‌రెడ్డిలు అంబటికి సూచించారు. రాస్తారోకో విరమించేదిలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు భీష్మించుకుకూర్చున్నారు. దీంతో సత్తెనపల్లి డిఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వలయంగా ఏర్పడి అంబటితో పాటు కార్యకర్తలను పక్కకు లాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు అంబటి మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల పైకి వేలెత్తిచూపుతూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఇద్దరు సిఐ చొక్కాలను పట్టుకొని, నా ఒంటిపై చేయి వేస్తారా? అంటూ మండిపడ్డారట. అంబటిని బలవంతంగా పోలీసులు జీపులోకి ఎక్కించి పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ఎదుట, కొండమోడు సెంటర్లో కార్యకర్తలు కొద్దిసేపు మళ్లీ రాస్తారోకో చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. 

Recent Posts