Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

జగన్, షర్మిల మధ్య అంతర్గత పోరు?

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య అంతర్గత పోరు నడుస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వైయస్ జగన్ జైలులో ఉన్న సమయంలో పాదయాత్ర, బస్సు యాత్రలతో పార్టీని నిలబెట్టిన తనకు కడప పార్లమెంటు సీటు కేటాయించాల్సిందేనని షర్మిల పట్టుబడుతున్నారట. అయితే, ఆ సీటును వైయస్ జగన్ అవినాష్ రెడ్డికి కేటాయించారు. దీంతో కడప పార్లమెంటు సీటు ఇవ్వడం కుదరదని జగన్ చెల్లెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. తండ్రి వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి షర్మిల కడప లోకసభ సీటును డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. దీన్నిబట్టి వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం జగన్, షర్మిల మధ్య పోరు మొదలైనట్లు గిట్టనివారు అంటున్నారు. వీరిద్దరి మధ్య వ్యవహారం పార్టీ గౌరవాధ్యక్షురాలు, తల్లి వైయస్ విజయమ్మకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. అన్న జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ఆ రకంగా ఆమె సీమాంధ్రలో పార్టీని నిలబెట్టి, వేడి తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. అంతగా కష్టపడినందుకు తనకు కడప లోకసభ సీటు కావాలని ఆమె పట్టుబడుతున్నారట. కాగా, సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకున్న వైయస్ జగన్ వెంట తెలంగాణ నేతలు దాదాపుగా లేకుండా పోయారు. గట్టు రామచందర్ రావు, బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి వంటి ప్రజాబలం నేతలు మాత్రమే ఆయన వెంట ఉన్నారని ప్రత్యర్థులు అంటున్నారు. ఏమైనా, జగన్‌కు వచ్చే ఎన్నికలు నల్లేరు మీద నడకేమీ కాదని అంటున్నారు.

Recent Posts