Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

పరిశ్రమల లెక్క ఇదీ!: ఐటిలో హైద్రాబాద్ తర్వాత విశాఖే





హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే ఎక్కువగా పరిశ్రమలు కేంద్రీకృతమయ్యాయని పరిశ్రమల శాఖ గణాంకాలను వెల్లడించింది. హైదరాబాద్ చుట్టుపక్కలే పారిశ్రామికీకరణ ఎక్కువగా ఉంది! సీమాంధ్రలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఒక్క విశాఖపట్నంలో మాత్రమే! రాష్ట్ర విభజన నేపథ్యంలో సర్కారు ప్రాంతాల వారీ పరిశ్రమల లెక్కలు కూడా తీసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలుపుకొని తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం 1,03,000 భారీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లు ఉన్నాయి. వీటి పెట్టుబడి మొత్తం రూ.50 వేల కోట్లుగా ఉంది. ఈ పరిశ్రమల ద్వారా 17,43,782 మందికి ఉపాధి లభించిందని పరిశ్రమల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో 18,600 భారీ, ఎంఎస్ఎంఈ యూనిట్లుండగా దీనికి ఆనుకునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 33,235 యూనిట్లున్నాయి. నల్లగొండలో 10,156 యూనిట్లుంటే.. మెదక్ జిల్లాలో 8343 యూనిట్లున్నాయి. తెలంగాణలో అతి తక్కువ పరిశ్రమలున్నది ఆదిలాబాద్ జిల్లాలో. రాజధాని నగరానికి దగ్గరగా ఉండటం, ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు హైదరాబాద్, దాని చుట్టుపక్కలే యూనిట్ల ఏర్పాటుకు మొగ్గు చూపాయని పరిశ్రమల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో ఐటి రంగంతోపాటు ఎంతో కీలకమైన ఇంజనీరింగ్, తయారీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఏరో స్పేస్, సిమెంట్, ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థలున్నాయి. వీటితోపాటు వైద్య, విద్యా రంగాలు కూడా రాజధాని చుట్టుపక్కల పెద్ద ఎత్తున కేంద్రీకృతమయ్యాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే బిహెచ్ఈఎల్ వంటి భారీ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కీలకమైన రక్షణ సంస్థలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఉన్నాయి. రాబోయే రోజుల్లోనూ ఈ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాలు, ఇప్పటికే పెద్ద ఎత్తున విస్తరించి ఉన్న విడిభాగాల తయారీ సంస్థల కారణంగా కొత్త సంస్థలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌లో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉండటంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం కూడా ఎంతో సానుకూల అంశంగా ఉంది. ఇక, సీమాంధ్ర ప్రాంతంలో ప్రస్తుతం 77,141 భారీ, ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన యూనిట్లున్నాయి. వీటి ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. సీమాంధ్రలో పారిశ్రామికంగా కాస్త అభివృద్ధి చెందిన ప్రాంతం విశాఖపట్నం. ఇక్కడే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమతోపాటు వైజాగ్ పోర్టు, గంగవరం ఓడరేవు ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత ఐటి రంగం విస్తరించిన ప్రాంతమూ ఇదే. ఇక్కడ ఫార్మా సిటీ ఉన్నా ఈ ప్రాజెక్టు ఆశించిన స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించటంలో విజయవంతం కాలేదని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి.

Recent Posts