Latest

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆసీస్ పై భారత్ ఘనవిజయం !







జైపూర్: రెండో వన్డేలో భారీ లక్ష్యాన్ని భారత్ దూకుడుగా ఛేదించి రెండు వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మొదటి మ్యాచు ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి బుధవారం జరిగిన మ్యాచులో 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సెంచరీలతో చెలరేగగా, శిఖర్ ధావన్ కేవలం ఐదు పరుగులతో సెంచరీ మిస్సయ్యాడు. 43.3 ఓవర్లలో భారత్ 362 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇరు జట్ల మధ్య సిరీస్ 1-1తో సమమైంది. మరో ఐదు వన్డేలు జరగాల్సి ఉంది. రోహిత్ శర్మ 123 బంతుల్లో 17 ఫోర్లు నాలుగు సిక్స్‌లతో 141 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ వంద పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ తొలుత ఆచితూచి ఆడుతూ వచ్చి చివర్లో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 360 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు నింపాదిగా ఆడుతూ వికెట్లు కూలకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. శిఖర్ ధావన్ ధాటిగా ఆడి 95 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో 176 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ వేగంగా అర్థ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 27 బంతుల్లో మూడు ఫోర్లతో, నాలుగు సిక్స్‌లతో అతను అర్థ సెంచరీ చేశాడు. అప్పటికి భారత్ స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 246 పరుగులు ఉంది. రోహిత్ శర్మ తన సత్తా చాటి సెంచరీ చేశాడు. అతనికి ఇది వన్డేల్లో మూడో సెంచరీ. 99 పరుగుల వద్ద ఒక్క పరుగు తీసి సెంచరీ సాధించాల్సి ఉండగా ఫోర్ కొట్టాడు. అతను 102 బంతుల్లో మూడు సిక్స్‌లలు 11 ఫోర్లతో 103 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.




ఆ తర్వాత విరాట్ కోహ్లీ చాలా దూకుడుగా సెంచరీ పూర్తి చేశాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో సెంచరీ సాధించాడు. భారత క్రికెటర్లలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. రావడంతోనే అతను ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడికి పూనుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా దుమ్ము రేపింది. నిర్ణీత యాబై ఓవర్లలో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. విజయానికి భారత్ 360 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ లక్ష్య ఛేదన దాదాపుగా అసాధ్యమనిపించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ జార్జ్ బెయిలీ 50 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లు ఆసీస్ బ్యాటింగ్ ధాటికి తేలిపోయారు. ఫాస్ట్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. వినయ్ కుమార్ రెండు వికెట్లు తీయగా, అశ్విన్ ఒక్క వికెట్ తీశాడు. ఇద్దరు రన్నవుట్ అయ్యారు. యువరాజ్ సింగ్‌ను ప్రయోగించినా లాభం లేకపోయింది. ఆస్ట్రేలియా 74 పరుగుల వద్ద ఫించ్ రన్నవుట్ కావడంతో తొలి వికెట్ కోల్పోయింది. అర్థ సెంచరీ చేసిన తర్వాత అతను పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ భారత బౌలింగును చిత్తుగా కొట్టారు. షేన్ వాట్సన్, ఫిలిప్ హ్యూజెస్ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 30 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 160 పరుగులు దాటింది. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఐదుగురు అర్థ సెంచరీలు చేసి ప్రపంచ రికార్డును సాధించారు. ఓ మ్యాచులో ఐదుగురు అర్థ సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే షేన్ వాట్సన్ 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వినయ్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 182 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హ్యూజెస్ సెంచరీ మిస్సయ్యాడు. అతను 83 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 212 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా 308 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాక్స్‌వెల్ రన్నవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా 347 పరుగులు వద్ద ఐదో వికెట్ కోల్పేయింది. వోగ్స్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వినయ్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. ఇరు జట్ల వివరాలు భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధవాన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ధోనీ, రవీంద్ర జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, వినయ్ కుమార్, ఇషాంత్ శర్మ, మొహ్మద్ సమీ, జైదేవ్ ఉద్కంట్. ఆస్ట్రేలియా : అరోన్ ఫించ్, ఫిలిప్ హ్యూజ్, షేన్ వాట్సన్, బైల్లీ, వోగ్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బ్రాడ్ హ్యాడ్డిన్, జేమ్స్ ఫాల్క్‌నర్, మిచెల్ జాన్సన్, క్లింట్ మిక్‌కీ, జేవియర్ దోహార్తీ




Recent Posts